Tamil Nadu: తమిళనాడు ఆర్టీసీ ఉద్యోగుల మెరుపు సమ్మె...ఎక్కడి బస్సులు అక్కడే
- వేతనాల్లో కోత విధించారన్న అనుమానంతో నిరసన
- విధులు బహిష్కరించిన 23 వేల మంది ఉద్యోగులు
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చెన్నై నగరవాసులు
తమిళనాడు రాష్ట్ర రోడ్డు ట్రాన్స్‌పోర్టు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. తమ వేతనాల్లో సంస్థ కోత పెట్టిందన్న అనుమానంతో ఉద్యోగులు ఈరోజు మెరుపు సమ్మెకు దిగడంతో చెన్నై నగరంలో తిరగాల్సిన బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చెన్నై నగరాన్ని నీటి కొరత వేధిస్తున్న విషయం తెలిసిందే. నీటి సమస్య వేధిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక నిధుల సేకరణలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జూన్ నెల వేతనాల నుంచి కోత విధించారన్న సమాచారం రెండు మూడు రోజుల నుంచి ఉద్యోగ వర్గాల్లో షికారు చేస్తోంది. ఈ వార్తకు తోడు, కొందరు ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జమయిన వేతనాల మొత్తం తక్కువగా ఉండడంతో ఉద్యోగులు ఈ వార్త నిజమేనని భావించి మెరుపు సమ్మెకు దిగారు.
మొత్తం 23 వేల మంది ఉద్యోగులు విధులు బహిష్కరించారు. దీంతో రాష్ట్రానికి చెందిన 3,200 బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కాగా, ఉద్యోగుల మెరుపు సమ్మెతో అధికారులు నష్ట నివారణ చర్యలకు దిగారు. ఉద్యోగులు ఊహిస్తున్నట్లు వేతనాల్లో ఎటువంటి కోత విధించలేదని తెలిపారు. వారాంతపు రోజు కావడంతో వేతనాలు జమ కావడం ఆలస్యమయిందని వివరణ ఇచ్చారు. ఇప్పటికే కొందరు ఉద్యోగుల వేతనాలు చెల్లించామని, మిగిలిన వారివి ఒకటి రెండు రోజుల్లో చెల్లిస్తామని తెలిపారు.