Andhra Pradesh: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో టీడీపీ నేతల భేటీ!
- 130 మంది టీడీపీ కార్యకర్తలపై దాడిచేశారు
- ఈ క్రమంలో ఇద్దరిని హత్య చేశారు
- దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
- డీజీపీకి ఫిర్యాదు చేసిన సోమిరెడ్డి, చినరాజప్ప, జూపూడి
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో ఈరోజు టీడీపీ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 130 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయనీ, ఇద్దరిని హత్య చేశారని డీజీపీకి ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. డీజీపీని కలిసినవారిలో మాజీ మంత్రులు చినరాజప్ప, సోమిరెడ్డి, నేతలు రాజేంద్ర ప్రసాద్, వర్ల రామయ్య, కరణం బలరాం, జూపూడి ప్రభాకర్, పంచుమర్తి అనురాధ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి మాట్లాడుతూ.. రేషన్ షాపు డీలర్లను కూడా వైసీపీ నేతలు బెదిరిస్తున్నారనీ, సరుకు తీసుకొస్తే విజిలెన్స్ దాడులు చేయిస్తాం అని హెచ్చరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేయడం మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్లు ఉందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న వైసీపీ శ్రేణులు టీడీపీపై దాడిచేస్తూ, తమపైనే దాడి జరుగుతోందని ఎదురు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.