Andhra Pradesh: ‘రాజన్న రాజ్యం’ అంటే విత్తనాల కోసం క్యూలైన్లు, పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు అన్నమాట!: నారా లోకేశ్
- నెల్లూరు, విజయనగరం, అనంతపురంలో రైతులు అల్లాడుతున్నారు
- ఇప్పటికైనా మాపై అవినీతి బురద చల్లడం మానండి
- రైతులకు సమయానికి విత్తనాలను సరఫరా చేయండి
ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వ్యవసాయానికి విత్తనాలు అందక రైతులు ఆందోళనకు దిగుతున్నారు. అనంతపురం, నెల్లూరు, విజయనగరం సహా పలు జిల్లాల్లో రైతులు తమకు విత్తనాలు సరఫరా చేయాలని ధర్నాకు దిగారు. తాజాగా ఈ విషయమై ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. ‘‘రైతులకు విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి జగన్ గారు, రాష్ట్రానికి నీళ్లు తెస్తా అని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలకు వెళ్లారట. అనంతపురం, విజయనగరం, నెల్లూరు ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల 'విత్తనాలో జగన్ గారూ' అంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు.
రాజన్న రాజ్యం అంటే విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్ లో ఎదురుచూపులు, లాఠీఛార్జ్ లో దెబ్బలు తినాలి అని మరోసారి గుర్తుచేశారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ బురద జల్లే కార్యక్రమాలతో కాలయాపన మాని రైతులకు విత్తనాలు అందించే పని మొదలు పెట్టండి’’ అని లోకేశ్ హితవు పలికారు. ఈ సందర్భంగా విత్తనాల కోసం క్యూలైన్లలో రైతులు పడుతున్న వెతలపై ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో లోకేశ్ పోస్ట్ చేశారు.