Pawan Kalyan: ప్రభుత్వం ఇచ్చే విత్తనాలను రైతులు బయట అమ్ముకుంటున్నారని ఆరోపించడం సరికాదు: పవన్ కల్యాణ్
- రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితులు కల్పించొద్దు
- ప్రశాంతంగా పొలాల్లో వ్యవసాయం చేసుకోనివ్వండి
- ఖరీఫ్ ప్రారంభమైనా రైతులకు బకాయిలు అందడంలేదు
జనసేనాని పవన్ కల్యాణ్ రాష్ట్రంలో రైతుల సమస్యలపై స్పందించారు. రైతులకు వెంటనే బకాయిలు చెల్లించి, సకాలంలో విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలను రైతులు బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించడం, అలా అమ్ముకున్న రైతులకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందవని అధికారులు హెచ్చరికలు చేయడం సరికాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితులను నివారించి, పంటపొలాల్లో ప్రశాంత వాతావరణంలో వ్యవసాయం చేసుకునేలా చేయాలని సూచించారు.
రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచకుండా, వ్యవసాయ శాఖ నిర్లక్ష్యపూరిత ధోరణి ప్రదర్శిస్తోందని పవన్ ఆరోపించారు. మరోవైపు, ఖరీఫ్ పనులు ప్రారంభమైనా ఇప్పటికీ ధాన్యం అమ్మిన సొమ్ము రాకపోవడం రైతులను కష్టాల్లోకి నెడుతోందని, ప్రభుత్వం నుంచి రైతులకు రూ.610 కోట్లు చెల్లింపుల రూపేణా రావాల్సి ఉందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పరిస్థితిపై సమీక్ష జరపాలని జనసేనాని కోరారు. ఈ మేరకు జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్ లో లేఖ విడుదల చేశారు.