Telangana: నాపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన మీడియా క్షమాపణలు చెప్పాలి: కడియం శ్రీహరి డిమాండ్

  • నేను బీజేపీలో చేరుతున్నానంటూ దుష్ప్రచారం
  • ఈ వార్తలను ఖండిస్తున్నా
  • కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ లోనే కొనసాగుతా

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆ పార్టీని వదిలి బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. బీజేపీలో చేరుతున్నానంటూ తనపై తప్పుడు వార్తలు ప్రచురించిన దక్కన్ క్రానికల్, హెచ్ఎంటీవీ, మహాన్యూస్ సంస్థలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరిస్తూ కడియం శ్రీహరి బహిరంగ లేఖను విడుదల చేశారు.

ఎదుగుతున్న దళిత నాయకత్వాన్ని బలహీనపర్చే కుట్రలో భాగంగా కొన్ని స్వార్థపర శక్తులు వారి వ్యక్తిత్వాన్ని, అవకాశాలను దెబ్బతీసే విధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తుంటాయని ఆరోపించారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారని, దీనిని గమనించాల్సిందిగా ప్రజలను, మీడియాను కోరుతున్నట్టు చెప్పారు. పార్టీలు మారాల్సిన అవసరం, పదవుల కోసం పాకులాడాల్సిన పరిస్థితి తనకు లేదని స్పష్టం చేశారు. కులం, మతం ఆధారంగా రాజకీయం చేసే పార్టీలకు తాను దూరంగా ఉండే వ్యక్తిని అని, బీజేపీలోకి వెళ్లే దుస్థితి తనకు లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తోందని, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామిగా నిలవబోతోందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ లోనే కొనసాగుతూ తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని తన లేఖలో శ్రీహరి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News