Mumbai: ముంబయి ఎయిర్ పోర్టులో భద్రతాసిబ్బందితో వేళాకోళం.. జైలుపాలైన అహ్మదాబాద్ వ్యాపారవేత్త!
- ఆత్మాహుతి బాంబర్ నంటూ హడావుడి
- అరెస్ట్ చేసిన పోలీసులు
- దోషిగా నిరూపితమైతే ఆరేళ్ల జైలు!
అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కేవలం నోటిదురుసు కారణంగా జైలుపాలయ్యాడు. అతుల్ పటేల్ అనే 35 ఏళ్ల బిజినెస్ మేన్ వ్యాపార పనుల నిమిత్తం దుబాయ్ వెళుతూ ముంబయి ఎయిర్ పోర్టులో తనను తనిఖీలు చేస్తున్న భద్రతాసిబ్బందితో "నేను ఆత్మాహుతి బాంబర్ ను, నన్ను త్వరగా తనిఖీ చేయండి" అంటూ పరాచికాలు ఆడాడు. అతడి హడావుడి చూసిన సీఐఎస్ఎఫ్ అధికారులు వెంటనే ఎయిర్ పోర్టులో అలర్ట్ ప్రకటించి, పటేల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అతడి లగేజీని కూడా స్కానింగ్ మెషీన్ నుంచి తొలగించి, నిశితంగా సోదాలు చేశారు.
ఎలాంటి అనుమానించదగ్గ ఆధారాలు లభించకపోయినా, అతడి వ్యాఖ్యల దృష్ట్యా, లిఖితపూర్వకంగా స్టేట్ మెంట్ తీసుకున్నారు. అతుల్ పటేల్, అధికారులకు రాసిచ్చిన లేఖలో కూడా తాను ఓ సూసైడ్ బాంబర్ ననీ, తనను త్వరగా చెక్ చేయాలని కోరాననీ పేర్కొన్నాడు. ఇలా ఎందుకు చేశాడో అతడి నుంచి సరైన వివరణ రాలేదని ముంబయి ఎయిర్ పోర్టు భద్రతాధికారి తెలిపారు. దాంతో, పటేల్ ను ఐపీసీ సెక్షన్ 505 (1), 506 కింద అరెస్ట్ చేశారు. పటేల్ నిజంగా దోషే అయితే ఆరేళ్ల జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. పోలీసులు అతడ్ని స్థానిక న్యాయస్థానంలో హాజరుపర్చగా, కస్టడీ విధించింది.