Mumbai: బాబోయ్! ఈ స్థాయిలో వర్షం పడితే మావల్ల కాదు: చేతులెత్తేసిన ముంబై కార్పొరేషన్
- గత నాలుగు రోజులుగా ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు
- నెల మొత్తం కురవాల్సిన వర్షం 48 గంట్లోనే
- ఈ దశాబ్దంలోనే తొలిసారి
ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలను చూసి అధికారులు హడలిపోతున్నారు. ఈ స్థాయిలో వర్షాలు పడితే తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. ముంబైలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రైళ్లు, విమానాలు, బస్సులు, విద్యుత్.. ఇలా అన్ని సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలైన దాదర్‌లోని హింద్మాతా చౌక్, కంజూర్‌మార్గ్, సియాన్ తదితర ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి.
పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం, సేవలను పునరుద్ధరించడం బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఈ సందర్భంగా బీఎంసీ కమిషనర్ ప్రవీణ్ పరదేశీ మాట్లాడుతూ.. ముంబైలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 85 శాతం వర్షపాతం నమోదైందన్నారు. జూన్ మొత్తంలో కురవాల్సిన వర్షం నాలుగు రోజుల్లోనే కురిసిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా కురవలేదని చెప్పారు. ఈ దశాబ్దంలో ఇలా కురవడం ఇదే తొలిసారని తెలిపారు. జూన్ నెల సగటు వర్షపాతం 550 మిల్లీమీటర్లు కాగా, గత 48 గంటల్లోనే అంతకుమించిన వర్షపాతం నమోదైందని వివరించారు. జనజీవనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ ప్రయత్నం చేస్తున్నామని, కానీ ఈ స్థాయిలో వర్షం పడుతుంటే తామేమీ చేయలేమని స్పష్టం చేశారు.