vijayashanthi: ప్రత్యక్ష పోరాటానికి దిగడానికి కూడా వెనుకాడను: విజయశాంతి హెచ్చరిక
- విద్య పేరుతో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవాలి
- సుప్రీంకోర్టు తీర్పుతో విద్యాశాఖ మేలుకోవాలి
- ఫీజుల నియంత్రణకు కంటితుడుపు చర్యగా కమిటీ వేశారు
తెలంగాణ విద్యాశాఖ సుప్రీంకోర్టు తీర్పుతోనైనా మేలుకోవాలని... విద్య పేరుతో జరుగుతున్న దోపిడీని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి డిమాండ్ చేశారు. అడ్డగోలుగా ఫీజులను వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల అరాచకాలను కట్టడి చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వడం హర్షణీయమని చెప్పారు. ఫీజులను నియంత్రించడానికి కంటితుడుపు చర్యగా ఓ కమిటీని ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు.
కేజీ నుంచి పీజీ వరకు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తూ విద్యాసంస్థలు స్వైర విహారం చేశాయని దుయ్యబట్టారు. ఫీజుల నియంత్రణ కోసం వేసిన కమిటీలు స్వేచ్ఛగా పనిచేసేందుకు ఇప్పటికైనా అవకాశం ఇవ్వాలని... ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటానికి దిగేందుకు కూడా తాను వెనుకాడనని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ ద్వారా స్పందించారు.