Tamilnadu: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను లాడ్జికి తీసుకెళ్లి లోబరచుకున్న ఎస్ఐ!
- కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానన్న స్థానిక నేత
- నమ్మి బంగారాన్ని అప్పగించిన మహిళ
- లోబరచుకుని కోరిక తీర్చుకున్న ఎస్ఐ
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి, ఆపై తనను మోసం చేశాడని ఓ వ్యక్తిపై ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీసు స్టేషన్ కు వచ్చిన మహిళను లోబరచుకునేందుకు లాడ్జికి తీసుకెళ్లిన ఎస్ఐపై వేటు పడింది. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా, శ్రీ వైకుంఠం సబ్ డివిజన్, తుంగనల్లూరు పరిధిలో జరిగింది. ఈ ప్రాంతంలోని ఓ మహిళ, తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం నిమిత్తం ఓ స్థానిక నాయకుడికి ఎనిమిది సవర్ల బంగారు నగలు ఇచ్చింది. ఆ నగలు తీసుకున్న అతను, ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేయగా, పోలీసులను ఆశ్రయించింది.
ఫిర్యాదు తీసుకున్న ఎస్‌ఐ, కేసు విచారణను పక్కనబెట్టి, ఆ మహిళను లోబరచుకున్నాడు. ఆమెను తీసుకుని తిరుచెందూరుకు వెళ్లి లాడ్జిలో మకాం వేశాడు. విషయం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచి పోలీసులు, తమ రిపోర్ట్ ను తూత్తుకుడి ఎస్పీకి అందించగా, అతన్ని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.