Supreme Court: సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకంలో బంధుప్రీతి, కుల పిచ్చి పెరిగిపోయాయి: మోదీకి అలహాబాద్ హైకోర్టు జడ్జి లేఖ
- సీనియర్ జడ్జిల బంధువులకు అవకాశాలు వస్తున్నాయి
- న్యాయవ్యవస్థ బంధుప్రీతి, కులప్రీతి ప్రభావానికి గురవుతోంది
- ఈ ప్రక్రియ అత్యంత గోప్యంగా జరుగుతోందన్న న్యాయమూర్తి
న్యాయ వ్యవస్థలో బంధుప్రీతి, కుల పిచ్చి పెరిగిపోయాయంటూ ప్రధాని మోదీకి అలహాబాద్ హైకోర్టు జడ్జి రంగనాథ్ పాండే లేఖ రాశారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల జడ్జిల నియామకంలో వివక్ష పెరిగిపోయిందని లేఖలో ఆయన పేర్కొన్నారు. 'దురదృష్టవశాత్తు భారత న్యాయవ్యవస్థ తీవ్ర స్థాయిలో బంధుప్రీతి, కులప్రీతి ప్రభావానికి గురవుతోంది. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిలుగా ఉండే వారి బంధువులు... కచ్చితంగా జడ్జిలుగా అవకాశం పొందుతున్నారు. ఇదంతా బంధుప్రీతి, కులప్రీతి కారణంగానే జరుగుతోంది' అని రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకంగా నియమితులైన జడ్జిలు ఇచ్చే జడ్జిమెంట్లు కూడా వారికి అనుకూలంగానే ఉంటున్నాయని చెప్పారు.
క్లోజ్డ్ డోర్ లో జరిగే సమావేశాల్లో జడ్జిల నియామకాలను సీనియర్ జడ్జిలు చేపడుతుంటారని రంగనాథ్ తెలిపారు. నియామకాల ప్రక్రియ అత్యంత గోప్యంగా జరుగుతుందని... నియామకాలు పూర్తైన తర్వాతే కొత్త జడ్జిల పేర్లను బయటకు వెల్లడిస్తారని చెప్పారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ గురించి ఆయన ప్రస్తావిస్తూ... నియామకాల్లో ఇలాంటి ప్యానెల్ పారదర్శకతను తీసుకొస్తుందని... అయితే, న్యాయవ్యవస్థ స్వతంత్రత పేరుతో ఈ ప్రపోజల్ ను జడ్జిలు తిరస్కరిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రపోజల్ పట్ల సీనియర్ జడ్జిలు స్పందించిన తీరు, తిరస్కరించిన తీరు వాస్తవాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయని అన్నారు.