Andhra Pradesh: పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పా.. అందుకే టీడీపీలో నన్ను పక్కన పెట్టారు!: గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం
- నాకు ఎన్టీఆర్ ఎంతో గౌరవం ఇచ్చారు
- చంద్రబాబు హయాంలో అది కరువయింది
- ప్రభుత్వ పరంగా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు
- టీడీపీ అధిష్ఠానంపై మండిపడ్డ సీనియర్ నేత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీలో అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. తాజాగా టీడీపీ అధిష్ఠానంపై పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చాక పార్టీలో తనకు తగిన గౌరవం, ప్రాధాన్యత దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుచ్చయ్య మాట్లాడుతూ..‘1982లో ఎన్టీఆర్ గారు నన్ను పిలిచి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కన్వీనర్ గా నియమించారు. అప్పట్లో కన్వీనర్లే ఉండేవారు. అధ్యక్షులు ఉండేవారు కాదు. రామారావు గారి టూర్ ప్రోగ్రాములు అన్నీ నేనే నిర్వహించా. పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చేటప్పుడు నా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు.
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అభ్యర్థులకు బీ-ఫారాలను నా ద్వారా పంపించారు. చాలామంది అభ్యర్థులకు నేనే టికెట్లు ఇప్పించా. ఈరోజు నాటికీ వాళ్ల దగ్గర కనీసం టీ కూడా తాగలేదు. రామారావుగారు నాకు అంత గౌరవం ఇచ్చారు. సామాజిక సమస్యలు ఏవైనా తీసుకెళితే వెంటనే స్పందించి పనిచేసి పెట్టేవారు’ అని తెలిపారు. తాను ఈరోజు నాటికీ చిన్న సొంత పని కోసం కూడా రామారావును, చంద్రబాబును కలవలేదని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత మాత్రం తనకు తగిన గుర్తింపు రాలేదని గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ తనను చిన్నన్న.. చిన్నన్న.. అంటూ ఆప్యాయంగా పలకరిస్తారని గుర్తుచేసుకున్నారు. ‘ఆ విలువ తర్వాత లేదు. టీడీపీలో నాకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లు కష్టపడ్డాం. డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేశాం. నాకు వాయిస్ ఉంది. అనర్గళంగా సబ్జెక్టుతో మాట్లాడగలను. కానీ ప్రభుత్వ పరంగా గత ఐదేళ్లుగా నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. పార్టీ ఫిరాయింపుల విషయంలో నేను విభేదించా. ఇది మంచి పద్ధతి కాదని చెప్పా. అందుకే నన్ను దూరం పెట్టారు’ అని బుచ్చయ్య చౌదరి వాపోయారు.