Andhra Pradesh: చంద్రబాబు అధికారులతో గంటలకు గంటలు సమీక్షలు చేయడం బాగా దెబ్బతీసింది!: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- ప్యాకేజీని సమర్థించాం.. అంతలోనే హోదా కావాలన్నాం
- దీంతో ప్రజల్లో టీడీపీపై విశ్వసనీయత దెబ్బతింది
- చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకే సమయం ఇవ్వలేదు
తాను లంచాలు తీసుకోననీ, తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని టీడీపీ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. తాను పార్టీ కోసమే మాట్లాడుతానని, విమర్శలు చేస్తాననీ, వ్యక్తిగతంగా ఎవ్వరినీ దూషించలేదని స్పష్టం చేశారు. అందుకే ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా తనను గౌరవించేవారని చెప్పారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముచ్చటించారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వ్యూహం సరిగ్గా లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ‘ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ పిల్లిమొగ్గలు వేసిందన్నది నా ఫీలింగ్. హోదా గురించి పట్టుబట్టాం. కానీ నిలబడలేదు. కేంద్రం హోదా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. దీంతో దాన్ని భుజాన వేసుకుని అదే బ్రహ్మాండం అయినట్లు ముందుకెళ్లడం తప్పు కదా!. ఏదో హోదా ఇస్తామన్నారు.. ఇప్పుడు అది ఇవ్వలేక ప్యాకేజీ ఇస్తున్నారు అని ప్రజలకు చెప్పకుండా ప్యాకేజీ వల్ల ఎన్ని లాభాలు వస్తాయో చెప్పుకుంటూ వెళ్లారు.
తీరా ఎన్నికలప్పుడు మళ్లీ హోదా కావాలి.. ప్యాకేజీ వద్దు అని టర్నవుట్ అయిపోయారు. దీనివల్ల ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతింటుంది కదా. పోలవరం విషయంలో చంద్రబాబు కష్టపడి పనిచేశారు. కేంద్రం ప్రాజెక్టులు 40-50 ఏళ్ల నుంచి నడుస్తున్నాయి. పట్టిసీమను బాబు నాలుగేళ్లలో కట్టి నీళ్లు ఇచ్చారు. రాయలసీమలో ఎంతో కొంత పరిశ్రమలు వచ్చాయి. కానీ కొన్ని విషయాల్లో నేల విడిచి సాము చేశారు. పార్టీ ఫంక్షనింగ్ సరిగ్గా నడవలేదు. చంద్రబాబు అభివృద్ధి మీద దృష్టి పెట్టడంతో గ్యాప్ వచ్చింది.
మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వలేని పరిస్థితికి చంద్రబాబు వచ్చేశారు. చంద్రబాబుకు మీటింగులు, కాన్ఫరెన్సులు మరీ ఎక్కువగా అయిపోయాయి. ఈ పనులను ఇతరులకు అప్పగించాల్సింది. కానీ చంద్రబాబు అంతా మీద వేసుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గంటలకుగంటలు సమీక్షలు చేశారనీ, దీనిపై అధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేసేవారని తెలిపారు.
పార్టీకి సమయం ఇవ్వాల్సిందిగా తాము కోరినా చంద్రబాబు సీరియస్ గా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు గ్రామ వాలంటీర్ల కింద వైసీపీ వాళ్లకే ప్రభుత్వం డబ్బులు ఇవ్వబోతోందని ఆరోపించారు. సమష్టి బాధ్యత అన్నది టీడీపీ నేతల్లో కొరవడిందనీ, ఏదో మొక్కుబడిగా వచ్చేశాం.. కాఫీ తాగాం.. వెళ్లిపోయాం అనే రీతిలో నేతలు వ్యవహరించారని విమర్శించారు.