Undavalli: కరకట్టను మేము ఆక్రమించుకోలేదు, మా భూమినే కృష్ణానది ఆక్రమించుకుంది: బీజేపీ నేత గోకరాజు గంగరాజు
- సీఆర్డీఏ నోటీసులపై స్పందించిన గోకరాజు గంగరాజు
- మా భవనం నిర్మించాకే ఆ జీవో వచ్చింది
- ఇరవై ఐదేళ్ల క్రితం నుంచి ఉండవల్లిలోని 25 ఎకరాల్లో ఉంటున్నా
ఉండవల్లిలోని కరకట్టను తాము ఆక్రమించుకోలేదని, తమ భూమినే కృష్ణానది ఆక్రమించుకుందని బీజేపీ నేత గోకరాజు గంగరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లిలోని కరకట్టపై నిర్మించిన అక్రమ నిర్మాణాలకు సీఆర్డీఏ నోటీసులిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ కు కూడా నోటీసులు ఇచ్చింది. ఈ విషయమై ఆయన స్పందిస్తూ, తన భవనం నిర్మించిన తర్వాతే నదికి వంద మీటర్ల లోపల ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న జీవో వచ్చిందని గుర్తుచేశారు. తాము ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని, చట్ట ప్రకారమే నడుచుకున్నామని అన్నారు.
ఇరవై ఐదేళ్ల క్రితం నుంచి ఉండవల్లిలోని 25 ఎకరాల్లో ఉంటున్నానని, గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఉడా, ఇరిగేషన్ అనుమతి ఉందని, బీపీఎస్ వచ్చిన తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేసినా అనుమతి రాలేదని అన్నారు. దీంతో, నది నుంచి 30 అడుగులు వెనక్కి భవనం నిర్మించుకోమని ఇరిగేషన్ అధికారులు తనకు అనుమతిచ్చినట్టు చెప్పారు. కరకట్టపై తాను నిర్మించింది విలాసవంతమైన భవనం కాదని, కేవలం ఫాంహౌస్ మాత్రమేనని అన్నారు. ప్రజావేదికను కూల్చినట్టే అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చాలంటే రాష్ట్ర వ్యాప్తంగా నదుల వెంబడి ఎన్నో నిర్మాణాలను కూల్చివేయాల్సి వస్తుందని, సీఆర్డీఏ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం చెబుతానని అన్నారు.