Central Cabinet: కేంద్ర కేబినెట్ భేటీలో కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర
- విమానాశ్రయాల లీజు విషయంలో ఆమోదం
- వరి మద్దతు ధర 3.7 శాతం పెంపుదల
- వేజ్ కోడ్‌పై బిల్లుకు ఆమోద ముద్ర
పార్లమెంట్ ప్రాంగణంలో నేడు భేటీ అయిన కేంద్ర కేబినెట్, కొన్ని కీలక ప్రతిపాదనలకు తన అంగీకారం తెలిపింది. భేటీ అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. దేశంలోని లక్నో, మంగుళూరు, అహ్మదాబాద్ విమానాశ్రయాలను లీజుకిచ్చే విషయంలో కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే ఖరీఫ్ పంటల మద్దతు ధరకు కూడా ఆమోదం తెలిపింది.
2019-20కి సంబంధించి వరి మద్దతు ధరను 3.7 శాతం పెంచడంతో పాటు పప్పు ధాన్యాలు, జొన్నలు, రాగుల ధరలను కూడా పెంచేందుకు ఆమోదం తెలిపింది. మరో మూడు కీలక బిల్లుల విషయంలో కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని, కానీ వాటి వివరాలను పార్లమెంట్ సమావేశాల్లో మాత్రమే వెల్లడిస్తామని అన్నారు. వేజ్ కోడ్‌పై బిల్లుకు ఆమోద ముద్ర పడిన విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించారు.