Andhra Pradesh: టీడీపీ వ్యూహంలో చిక్కుకుని వైఎస్ గిజగిజలాడారు.. కావాలంటే ఈ పేపర్లు చూసి తరించండి!: సీఎం జగన్ కు లోకేశ్ కౌంటర్
- కాంగ్రెస్ అవినీతిని టీడీపీ తెలివిగా బయటపెట్టింది
- ఎల్లంపల్లి ప్రాజెక్టులో రూ.400 కోట్ల అవినీతి జరిగింది
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన నారా లోకేశ్
ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారని ఏపీ సీఎం జగన్ నిన్న విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ విమర్శలను తిప్పికొట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతుల ప్రారంభం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ బురదచల్లే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.
ఆరోజున అసెంబ్లీలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతిని టీడీపీ తెలివిగా బయటపెట్టిందని వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో ఆ ప్రాజెక్టులో రూ.400 కోట్ల అవినీతి చోటుచేసుకుందనీ, దాన్ని ప్రజలకు మరోసారి గుర్తుచేసినందుకు లోకేశ్ ధన్యవాదాలు చెప్పారు.
సీఎం జగన్ ఆనాటి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను చదువుకుని వస్తే బాగుండేదని లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహం ప్రకారం మీ తండ్రిగారి ప్రభుత్వ అవినీతిని బయటపెట్టింది. ఆ వ్యూహంలో ఇరుక్కుని గిజగిజలాడింది వైఎస్ గారే. ఇదిగోండి ఆ మరునాడు వచ్చిన పత్రికా కథనాలు. మీ నాయనగారి అవినీతి ధనయజ్ఞం గురించి ఎంత గొప్పగా రాశాయో చదివి తరించండి’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
ఏపీలో ధనయజ్ఞం సాగుతున్న రోజుల్లో జగన్ సెటిల్మెంట్లతో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాబట్టి ఆయనకు రాష్ట్రంలో, అసెంబ్లీలో, ముఖ్యంగా అది ఇచ్చంపల్లో లేక ఎల్లంపల్లో తెలుసుకునే అవకాశం లేకపోయిందని చురకలు అంటించారు. ఎవరో చెప్పిన గాలి మాటలను పట్టుకుని ఆకాశం మీద ఉమ్మే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన లోకేశ్ పలు పత్రికల కథనాలను తన ట్వీట్లకు జత చేశారు.