West Indies: నామమాత్రపు మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్... కెరీర్ లో చివరి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతున్న గేల్
- బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ కెప్టెన్
- ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్
- లీడ్స్ వేదికగా ప్రపంచకప్ లీగ్ మ్యాచ్
ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ చివరిదశకు చేరుకుంది. ఇప్పటికే అన్ని సెమీస్ బెర్తులు దాదాపు ఖాయమైన స్థితిలో వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఎలాంటి ప్రాధాన్యంలేని మ్యాచ్ లో పోటీపడుతున్నాయి. లీడ్స్ ఆతిథ్యమిస్తున్న ఈ లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కరీబియన్ జట్టులో ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్ స్థానంలో ఎవిన్ లూయిస్, పేసర్ షానన్ గాబ్రియెల్ కు బదులుగా కీమార్ రోచ్ జట్టులోకి వచ్చారు. ఇక ఆఫ్ఘన్ జట్టులోనూ రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. హమీద్ హసన్, హస్మతుల్లా స్థానంలో సయీద్ షిర్జాద్, దౌలత్ జాద్రాన్ తుది జట్టులో ఆడనున్నారు.
కాగా, క్రికెట్ చరిత్రలో అత్యంత విధ్వంసక బ్యాట్స్ మన్ గా పేరుగాంచిన విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తన కెరీర్ లో చివరి వరల్డ్ కప్ మ్యాచ్ లో బరిలో దిగుతున్నాడు. ఈ టోర్నీ తర్వాత భారత్ తో సిరీస్ సందర్భంగా గేల్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్న సంగతి తెలిసిందే.