Maharashtra: మహారాష్ట్రలో అమానుషం.. ప్రభుత్వ ఇంజనీర్ పై బురద పోసి, బ్రిడ్జీకి కట్టేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!
- మహారాష్ట్రలోని కంకవళ్లిలో ఘటన
- రోడ్డు గుంతలను పూడ్చకపోవడంపై ఆగ్రహం
- ఇంకా స్పందించని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్
ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగి కావడం కన్నా మరో దురదృష్టం లేదని అనిపిస్తోంది. ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి వెళ్లిన మున్సిపల్ అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయవర్గీయ దాడిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటన స్ఫూర్తితోనేమో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నితీష్ నారాయణ్ రాణే, ఆయన అనుచరులు రెచ్చిపోయారు. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రోడ్డును పరిశీలిస్తున్న ఇంజనీర్ పై రెండు బకెట్ల నిండా బురదను పోసి అవమానించారు. రోడ్డుకు గుంతలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇంజనీర్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంకవళ్లి ప్రాంతంలో ముంబై-గోవా జాతీయ రహదారిపై గుంతలను పరిశీలించేందుకు హైవే ఇంజనీర్ ప్రకాశ్ షెడేకర్ ఈరోజు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాణే, ఆయన అనుచరులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఇంజనీర్ ప్రకాశ్ తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఇంజనీర్ పై చిక్కటి బురద పోసి, తాళ్లతో పక్కనే ఉన్న బ్రిడ్జికి కట్టేసి అవమానించారు. కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇంతవరకూ స్పందించలేదు.