dhinakaran: 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ... ఎవరూ ఏమీ చేయలేరు: దినకరన్
- అన్నాడీఎంకే, డీఎంకే కుట్రలకు పాల్పడుతున్నాయి
- పార్టీని ముక్కలు చేసేందుకు యత్నిస్తున్నాయి
- కేడర్ ఆధారంగా పని చేస్తున్న పార్టీ మాది
తన పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే)ను ముక్కలు చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ దినకరన్ మండిపడ్డారు. అధికార ఏఐఏడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు కుట్రలకు పాల్పడుతున్నాయని చెప్పారు. కొంత మంది నేతలు పోయినంత మాత్రాన తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు.
'రాజకీయాల్లో నాకు 30 ఏళ్ల అనుభవం ఉంది. పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోతారు, ఎవరు ఉండిపోతారనే విషయాన్ని నేను ముందే పసిగట్టగలను. ఏఎంఎంకే పని అయిపోయిందనే భావనను ప్రజల్లో కలిగించడానికి అన్నాడీఎంకే, డీఎంకేలు యత్నిస్తున్నాయి. వారు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదు. కేడర్ ఆధారంగా పని చేస్తున్న పార్టీ మాది. మా పార్టీ కేడర్ ఎప్పటికీ ఐక్యంగానే ఉంటుంది' అని దినకరన్ తెలిపారు.
పార్టీ కొత్త కార్యవర్గానికి సంబంధించిన జాబితాను ఇప్పటికే సిద్ధం చేశానని... త్వరలోనే పేర్లను ప్రకటిస్తానని దినకరన్ చెప్పారు. నీటి సమస్యను తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సమస్యను అధిగమించేందుకు ఎలాంటి చర్యలనూ చేపట్టడం లేదని విమర్శించారు.