Uttar Pradesh: యోగీ ప్రభుత్వం పింక్ స్లిప్లు.. ఉద్యోగులపై భారీగా వేటు!
- 29 విభాగాల్లోని 201 మందికి పింక్ స్లిప్లు
- 417 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధం
- అధికార దుర్వినియోగానికి పాల్పడితే జైలుకేనంటూ సీఎం హెచ్చరిక
యోగి ప్రభుత్వం తాజా నిర్ణయం మంత్రులు, ఉద్యోగుల్లో గుబులు పుట్టిస్తోంది. పనితీరు బాగాలేని వారిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్టు వార్తలు రావడంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. పనితీరు బాగాలేని వారిని గుర్తించిన ప్రభుత్వం 29 విభాగాల్లో 201 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇచ్చినట్టు ఓ పత్రిక వెల్లడించింది. ఈ జాబితాలో మరో 417 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిని సస్పెండ్ చేయడం కానీ, తొలగించడం కానీ చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జాబితాలో విద్యుత్ అధికారులే ఎక్కువ మంది ఉండడం గమనార్హం. పనితీరు, అవినీతి ఆరోపణల కారణంగా వీరు ఈ జాబితాలో చేరినట్టు తెలుస్తోంది.
ఈ వార్తలు ఇలా ఉండగానే, బుధవారం ఓ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. పనితీరు బాగుంటే రివార్డులు ఇచ్చి సత్కరిస్తామని, లేకుంటే ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, పనితీరు సరిగా లేని ఉద్యోగులపై కేసులు పెడతామని, అధికార దుర్వినియోగానికి పాల్పడితే జైలుకు పంపుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.