Nirmala Seetharaman: నేడే కేంద్ర బడ్జెట్... రూపు మారిన బ్రీఫ్ కేస్
- 11 గంటలకు లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
- తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న మహిళా మంత్రి
- పార్లమెంటుకు బయల్దేరిన ఆర్థికమంత్రి
లోక్ సభలో ఈరోజు ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. మన దేశ చరిత్రలో ఆర్థిక మంత్రిగా ఓ మహిళ ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. ఈ బడ్జెట్ లో దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచే అంశాలతో పాటు రైతులు, నిరుద్యోగులకు పెద్ద పీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2023లో జమిలీ ఎన్నికలకు వెళ్లనున్నారనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో, ఈ బడ్జెట్ అందరినీ ఆకట్టుకునే రీతిలో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి కాసేపటి క్రితం నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు బయల్దేరారు. తొలుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు బడ్జెట్ ప్రతాలను అందజేశారు. మరోవైపు, ఈ సార్ బడ్జెట్ బ్రీఫ్ కేసు మారింది. ఎర్రటి వస్త్రంతో చుట్టిన పార్సిల్ లాంటి దాంట్లో బడ్జెట్ పత్రాలు ఉన్నాయి. దానిపై మూడు సింహాల రాజముద్ర ఉంది. ఈ విధంగా ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయానికి నిర్మలా సీతారామన్ తెరదించారు.