Andhra Pradesh: కడప, అనంతపురం జిల్లాల్లో ఈ నెల 9న పర్యటిస్తా!: టీడీపీ అధినేత చంద్రబాబు
- టీడీపీకి 40 శాతం ప్రజలు ఓటేశారు
- వారందరికీ మేం అండగా నిలుస్తాం
- ఉండవల్లిలో పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం మంది ప్రజలు టీడీపీకి ఓటేశారనీ, వారందరిని రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై దాడులు పెరిగిపోవడం దారుణమని విమర్శించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అసూయలు, అపోహలు వదిలేసి కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఈ నెల 9న కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈరోజు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు.
ఏపీ సీఎం జగన్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, సంక్షేమ పథకాల కోసం కేంద్రం నుంచి ఇతోధికంగా నిధులు సాధించాలని చంద్రబాబు సూచించారు. ఏపీలో విత్తనాలు-ఎరువుల సమస్య, విద్యుత్ కోతలు, మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు.. ఇలా ఏ సమస్య వచ్చినా టీడీపీపై తోసి తప్పుకోవాలని జగన్ చూస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందన్నారు. ఏపీలో ప్రస్తుతం భయానక వాతావరణం సృష్టించారనీ, నేరాలు-ఘోరాలే పార్టీ విధానంగా ముందుకు వెళతున్నారని దుయ్యబట్టారు. ఇలాగే సాగితే వైసీపీని ప్రజలే దూరం పెడతారని హెచ్చరించారు.