India: 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం.. 5 ట్రిలియన్ల లక్ష్యం ఎంతో దూరంలో లేదు!: నిర్మలా సీతారామన్
- పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
- భారత్ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని వ్యాఖ్య
- భారత నిర్మాణంలో ప్రైవేటు కంపెనీలు కీలకపాత్ర పోషించాయన్న సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగిస్తూ.. సంస్కరణలు, అంకింత భావంతో పనిచేయడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం కొత్త ఒరవడిని సృష్టించిందని సీతారామన్ తెలిపారు. ఈ ఏడాది భారత్ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని వెల్లడించారు. త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందనీ, కొనుగోలు శక్తిలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. మనకంటే ముందు అమెరికా, చైనాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో చిన్న, మధ్యతరహా, పెద్ద ప్రైవేటు కంపెనీలు కీలక పాత్ర పోషించాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. గతంలో లైసెన్స్ కోటా నియంత్రణ, విధానాపరమైన నిర్ణయాల్లో అలసత్వం ఉండేదనీ, అది ఇప్పుడు కనుమరుగైందని వ్యాఖ్యానించారు. తాము నవీన భారత నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. అట్టడుగు ప్రజలకు కూడా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. భారత్ మాల కార్యక్రమంలో రోడ్లు, సాగర్ మాల సాయంతో నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. పౌరుల ఆహార భద్రత కోసం కేటాయిస్తున్న నిధులను రెట్టింపు చేశామని పేర్కొన్నారు. చిన్నచిన్న పట్టణాలకు విమానయాన సౌకర్యం కల్పించేందుకు ‘ఉడాన్’ పథకం తీసుకొచ్చామని చెప్పారు. ప్రపంచంలోనే భారత్ ఈరోజు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు.