Vaiko: తమిళ రాజకీయవేత్త వైగోకు షాక్.. దేశద్రోహం కింద ఏడాది జైలు శిక్ష
- 2009లో ఎల్టీటీఈకి అనుకూలంగా వైగో వ్యాఖ్యలు
- అప్పట్లో ఆయనపై కేసు వేసిన డీఎంకే
- గతంలో ఏడాది పాటు జైల్లో ఉన్న వైగో
తమిళనాడు రాజకీయవేత్త, ఎండీఎంకే అధినేత వైగో (వి.గోపాలస్వామి)కు చెన్నైలోని ఓ కోర్టు షాకిచ్చింది. దేశద్రోహం కింద ఏడాది జైలుశిక్షను విధించింది. అయితే శిక్ష అమలుకు ఒక నెల సమయాన్ని ఇచ్చింది. 2009లో తన పుస్తకం విడుదల సందర్భంగా వైగో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఎల్టీటీఈకి వ్యతిరేకంగా యుద్ధాన్ని ఆపకపోతే భారత్ ఎంతో కాలం ఒక దేశంగా ఉండలేదు' అని ఆయన అప్పుడు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, భారతదేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారంటూ ఆయనపై కేసు నమోదైంది.
ఆసక్తికర విషయం ఏమిటంటే... అప్పట్లో వైగోకు వ్యతిరేకంగా డీఎంకే కేసు వేసింది. ప్రస్తుతం సంకీర్ణ కూటమిలో భాగంగా రాజ్యసభ అభ్యర్థిగా వైగోను అదే డీఎంకే ప్రతిపాదించింది. రేపు ఆయన నామినేషన్ వేయాల్సి ఉంది. రాజ్యసభ అభ్యర్థిగా ఆయన గెలిస్తే... 15 ఏళ్ల తర్వాత మళ్లీ పార్లమెంటులో అడుగుపెడతారు. లోక్ సభ ఎన్నికల్లో ఎండీఎంకేతో డీఎంకే పొత్తు పెట్టుకుంది. అసెంబ్లీలో ఎండీఎంకేకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేనప్పటికీ... పొత్తులో భాగంగా ఒక రాజ్యసభ స్థానాన్ని ఎండీఎంకేకు డీఎంకే కేటాయించింది.
ఎల్టీటీఈకి అనుకూలంగా వ్యాఖ్యానించినందుకు 2002లో అప్పటి జయలలిత ప్రభుత్వం వైగోను అరెస్ట్ చేయించింది. ఆ తర్వాత దాదాపు ఒక ఏడాది పాటు వేలూరు జైల్లో ఆయన ఉన్నారు.