Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో అద్భుతం.. నదికే ప్రాణం పోసిన కనదియా గ్రామస్తులు!
- పదేళ్లుగా నీటికొరతతో అల్లాడిన ప్రజలు
- ఇంజనీర్ సూచనలతో చిన్నపాటి డ్యామ్ నిర్మాణం
- ప్రాణం పోసుకున్న నది.. పచ్చగా మారిన కనదియా
సాధారణంగా కరవు పరిస్థితులు ఎదురైతే సాయం చేయాలని ప్రభుత్వానికి అధికారులు లేఖలు రాస్తారు. ప్రజలకు తాగడానికి, ఇతర అవసరాలకు ప్రభుత్వ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీళ్లను సరఫరా చేయడాన్ని కూడా మనం టీవీలు, పేపర్లలో చూసిఉంటాం. కానీ మధ్యప్రదేశ్ లోని కనదియా గ్రామస్తులు మాత్రం ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూ, చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఎండాకాలంలో నీటి కొరతకు చెక్ పెట్టడానికి చందాలు వేసుకుని మరీ చిన్న డ్యామ్ ను నిర్మించుకున్నారు. అంతేకాకుండా నదిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ ఎండాకాలంలో కూడా ఆ నదిలో నీళ్లు నిండుగా ఉన్నాయి.
ఈ విషయమై కనదియా గ్రామస్తుడు ఒకరు మాట్లాడుతూ..‘ప్రతిఏటా ఏప్రిల్-మే కాలానికి వాగు పూర్తిగా ఎండిపోయేది. మాకు ఈ సమస్య గత పదేళ్లుగా ఉంది. ఈ నేపథ్యంలో పరిష్కారం కోసం ఓ ఇంజనీర్ ను సంప్రదించాం. ఇందుకోసం గ్రామస్తులంతా చందాలు వేసుకున్నాం. అనంతరం తొలుత చిన్నపాటి డ్యామ్ ను నిర్మించాం. ఓసారి డ్యామ్ ను నిర్మించగా, భూగర్బ నీటిమట్టం పెరిగింది. క్రమంగా నదిలో ప్రవాహం కూడా ఎక్కువయింది. ఇక మాకు నీటి కొరత అన్నదే లేదు’ అని తెలిపారు.