Pakistan: ఈ వరల్డ్ కప్ లో పాక్ జట్టుకు కష్టాలే కష్టాలు!
- ఊరిస్తున్న సెమీస్ బెర్తు!
- సెమీఫైనల్ చేరాలంటే బంగ్లాను 7 పరుగుల్లోపే ఆలౌట్ చేయాలి
- పాక్ స్కోరు 315 రన్స్
అనిశ్చితికి మారుపేరుగా నిలిచే పాకిస్థాన్ క్రికెట్ జట్టు తనదైన రోజున బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొడుతుంది. కుదరని రోజున పసికూన కంటే దారుణంగా కుదేలవుతుంది. ఇది జగమెరిగిన సత్యం! ఈసారి వరల్డ్ కప్ లో కూడా కొన్ని మెరుగైన విజయాలు సాధించినా సెమీస్ బెర్తును సాధికారికంగా ఖాయం చేసుకోలేకపోయింది. చివరికి ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలు, సమీకరణాల తారుమారుపై ఆధారపడాల్సిన దుస్థితిలో పడింది. ఇవాళ బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడుతున్న పాక్ ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు.
ప్రపంచకప్ లో పాక్ సెమీఫైనల్ చేరాలంటే బంగ్లాదేశ్ పై 316 పరుగుల తేడాతో నెగ్గాలి. అది అసాధ్యమైన పని. ఎందుకుంటే పాక్ చేసిందే 315 పరుగులు. అంతకంటే ఎక్కువ తేడాతో గెలవడం కుదరని పని. ఇక, మరో చాన్స్ కూడా పాక్ ముందు మిగిలే ఉంది. అదేంటంటే, లార్డ్స్ మ్యాచ్ లో ఇప్పుడు బంగ్లాదేశ్ లక్ష్యఛేదనకు దిగాల్సి ఉంది. బంగ్లా జట్టును 7 పరుగుల్లోపే ఆలౌట్ చేయగలిగితే పాక్ ముందు సెమీస్ అవకాశం ఉంటుంది. ఇది కూడా ఊహకందని విషయం. కాబట్టి, ఈ వరల్డ్ కప్ లో పాక్ ప్రస్థానం ముగిసినట్టే.