Hyderabad: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ కాల్పుల ఘటనలో కొత్త విషయాలు!
- అప్పుల బాధతోనే ఫైజాస్ ఆత్మహత్యాయత్నం
- ఫైజాస్ కు రూ.5 కోట్ల మేర అప్పులు
- స్నేహితుల వద్ద అప్పు చేసిన ఫైజాస్
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా నార్సింగ్ వద్ద ఓ కారులో కాల్పుల మోత అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఫైజాస్ అనే యువకుడు బెంజ్ కారులో ఆత్మహత్యాయత్నం చేయడం తెలిసిందే. కాగా, ఆ యువకుడ్ని మొదట అశ్విన్ జైన్ గా మీడియాలో పేర్కొన్నా, ఆ తర్వాత అతడి పేరు ఫైజాస్ అని తేలింది.
ఇక అసలు విషయానికొస్తే, ఫైజాస్ అప్పులబాధతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. విలాసాలకు అలవాటుపడిన ఫైజాస్ మిత్రుల వద్ద రూ.5 కోట్లకు పైగా అప్పులు చేశాడు. డబ్బుల కోసం స్నేహితులు ఒత్తిడి చేయడంతోనే ఫైజాస్ సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు భావిస్తున్నారు.
ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారుతో పాటు మరో రెండు ఇతర కార్లను కూడా ఫైజాస్ అద్దెకు తీసుకుని, నెలకు రూ.5 లక్షలకు పైగా బాడుగ చెల్లిస్తున్నాడు. స్నేహితులు డబ్బు కోసం నిలదీస్తుండడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఫైజాస్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై దాదాపు రెండు గంటలపాటు తిరిగి నార్సింగ్ వద్ద తుపాకీతో కాల్చుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.