Shakib Al Hasan: 75, 64, 121, 124*, 41, 51, 66, 64... వరల్డ్ కప్ లో ఈ స్కోర్లు సాధించిన బ్యాట్స్ మన్ ఎవరో తెలుసా?
- ప్రపంచకప్ లో భీకర ఫామ్ లో ఉన్న షకీబ్
- ప్రతి మ్యాచ్ లోనూ బౌలర్లకు కొరకరాని కొయ్యే!
- 86 సగటుతో 606 పరుగులు
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో చెప్పేందుకు అతడు సాధించిన స్కోర్లే నిదర్శనం. ప్రతి మ్యాచ్ లోనూ డబుల్ ఫిగర్ కు తగ్గకుండా పరుగులు సాధిస్తూ, బంతిని బౌండరీ దిశగా పరుగులు పెట్టించిన షకీబల్ కు ఈ వరల్డ్ కప్ చిరస్మరణీయంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహంలేదు.
దక్షిణాఫ్రికాపై 75, న్యూజిలాండ్ తో 64, ఇంగ్లాండ్ పై 121, వెస్టిండీస్ పై 124 పరుగుల అజేయ శతకం, ఆసీస్ పై 41, ఆఫ్ఘనిస్థాన్ పై 51, భారత్ పై 66, ఇవాళ పాకిస్థాన్ పై 64 పరుగులు. ఇవీ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో షకీబల్ బ్యాట్ నుంచి జాలువారిన ఇన్నింగ్స్ లు.
ఓ ఆల్ రౌండర్, అది కూడా బంగ్లాదేశ్ వంటి మధ్యశ్రేణి జట్టుకు చెందిన ఆటగాడి నుంచి ఇలాంటి అరుదైన బ్యాటింగ్ ప్రదర్శనను ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే, ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ఆడిన షకీబల్ కనీసం తుదిజట్టులో కూడా స్థానం సంపాదించుకోలేకపోయాడు. బరిలో దిగిన మ్యాచ్ లలో కూడా అరకొర ప్రదర్శనలే తప్ప, స్థాయికి తగిన విధంగా ఆడిందిలేదు. అలాంటిది, వరల్డ్ కప్ లో మాత్రం చిచ్చరపిడుగల్లే చెలరేగిపోయాడీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్. మొత్తమ్మీద 8 మ్యాచ్ లాడి 86 సగటుతో 606 పరుగులు చేశాడు. వాటిలో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలున్నాయి.