icc world cup: అగ్రస్థానం కోసం భారత్.. పరువు కోసం శ్రీలంక.. ప్రపంచకప్‌లో నేడు ఆసక్తికర సమరం!
- నేటితో ముగియనున్న గ్రూప్ దశ
- దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ ఓడితే భారత్‌దే టాప్ ప్లేస్
- శ్రీలంకపై తేలిగ్గా తీసుకుంటే ముప్పే
ప్రపంచకప్‌లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్న కోహ్లీ సేన తన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్ ప్లేస్‌లోకి వెళ్లాలని భారత జట్టు భావిస్తుండగా, గెలిచి ప్రపంచకప్ నుంచి గౌరవంగా నిష్క్రమించాలని లంకేయులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక 3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. నేటి మ్యాచ్‌లో గెలవడం ద్వారా విజయాల సంఖ్యను పెంచుకోవాలని పట్టుదలగా ఉంది.
మరోవైపు, సెమీస్‌లో అడుగుపెట్టినప్పటికీ శ్రీలంకతో పోరును భారత్ తేలిగ్గా తీసుకోవడం లేదు. గ్రూప్ దశలో ఇంగ్లండ్‌కు షాకిచ్చిన శ్రీలంక బలంగానే ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి , నేడే జరగనున్న మరో లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను దక్షిణాఫ్రికా మట్టికరిపిస్తే భారత్ అగ్రస్థానంలోకి దూసుకెళుతుంది. అదే జరిగితే సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌లు తలపడతాయి.
అయితే, గత గణాంకాలను చూస్తే మాత్రం శ్రీలంక ప్రమాదకరంగానే కనిపిస్తోంది. 1996 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిన భారత్ ఇంటి ముఖం పట్టింది. భారత జట్టు చెత్తగా ఆడడంతో ప్రేక్షకులు ఆగ్రహంతో స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. వినోద్ కాంబ్లీ ఏడ్చుకుంటూ మైదానాన్ని వీడడం అప్పట్లో సెన్సేషన్ అయింది.
2007 ప్రపంచకప్‌లోనూ శ్రీలంక చేతిలో టీమిండియాకు పరాభవం ఎదురైంది. 69 పరుగుల తేడాతో ఓడింది. అయితే, సరిగ్గా నాలుగేళ్ల తర్వాత 2011 ప్రపంచకప్‌లో శ్రీలంకపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి కప్పు ఎగరేసుకుపోయింది. ఇక అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలోనూ శ్రీలంకపై భారత్ పైచేయి సాధిస్తూనే ఉంది. నేటి మ్యాచ్‌లోనూ అది రిపీట్ అవుతుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.