Australia: షాన్ మార్ష్, మాక్స్ వెల్ కు గాయాలు... ఆసీస్ లో ఆందోళన!
- నెట్ ప్రాక్టీస్ లో గాయపడ్డ మార్ష్
- మణికట్టుకు గాయంతో టోర్నీకి దూరం
- అతని స్థానంలో జట్టులోకి హ్యాండ్స్ కోంబ్
బ్రిటన్ లో జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు కీలక దశకు చేరుకున్న తరుణంలో, ఇంతవరకూ ఒకే ఒక్క ఓటమితో టాప్ ప్లేస్ లో ఉన్న ఆస్ట్రేలియా జట్టులో ఆందోళన మొదలైంది. ఆ జట్టులో కీలక ఆటగాడు షాన్ మార్ష్ గాయం కారణంగా మిగతా టోర్నీకి దూరమయ్యాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న వేళ, మార్ష్ మణికట్టుకు గాయంకాగా, అది ఇప్పట్లో తగ్గేది లేదని వైద్యులు సూచించడంతో అతను టోర్నీకి దూరమైనట్టు ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీలో మార్ష్ కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ హ్యాండ్స్ కోంబ్ ను తీసుకున్నామని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగ్ వెల్లడించాడు.
ఇదే సమయంలో నెట్ ప్రాక్టీస్ లో మరో స్టార్ ఆటగాడు మాక్స్ వెల్ కు కూడా గాయమైంది. అయితే, ఈ గాయంతో పెద్దగా ప్రమాదం లేదని లాంగర్ తెలియజేసినప్పటికీ, ఆ జట్టు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆసీస్ ఈ వరల్డ్ కప్ లో 8 మ్యాచ్ లు ఆడగా, ఇండియాపై మాత్రమే ఓడిపోయి, మిగతా 7 మ్యాచ్ లలో విజయం సాధించి, 14 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉంది. నేడు తన చివరి లీగ్ మ్యాచ్ ని దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే, ఆసీస్ టాప్ ప్లేస్ ను కొనసాగిస్తుంది. ఇదే సమయంలో నేడు శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో ఇండియా గెలిచి, సౌతాఫ్రికాపై ఆసీస్ ఓడిపోతే రెండో స్థానంలో ఉంటుంది.