South Africa: అంతా అయిపోయిన తర్వాత నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా!
- మాంచెస్టర్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
- 17 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 112 పరుగులు
- డికాక్ హాఫ్ సెంచరీ
ఈ ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా జట్టుది ఓ విచిత్రమైన గాథ. కనీసం సెమీస్ కు చేరుతుందని భావిస్తే, లీగ్ దశలో ఒక్క మ్యాచ్ గెలిచేందుకు ఆపసోపాలు పడింది. 8 మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ ల్లో గెలిచి మరో 5 మ్యాచ్ ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. దాంతో టోర్నీ నుంచి ఎప్పుడో నిష్క్రమించింది. చివరికి ఓ సాధారణ జట్టులా ఎలాంటి ప్రాధాన్యంలేని మ్యాచ్ లు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. పసలేని సారథ్యం, పేలవమైన బ్యాటింగ్, ప్రభావంచూపని బౌలింగ్... ఇలా సఫారీలకు ఈ టోర్నీ ఓ చేదు జ్ఞాపకం అనడంలో ఎలాంటి సందేహంలేదు.
ఇవాళ తన చివరి లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతోంది. మాంచెస్టర్ లో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలుచుకున్న దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. టోర్నీ మొదట్లో దారుణంగా విఫలమైన సఫారీ టాపార్డర్ ఈసారి బాధ్యతగా ఆడుతుండడం విశేషం అని చెప్పాలి. 17 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు 1 వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. ఓపెనర్ మర్ క్రమ్ 34 పరుగులు చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ డికాక్ 52 పరుగులతో ఆడుతున్నాడు. డికాక్ కు జతగా కెప్టెన్ డుప్లెసిస్ 15 పరుగులతో క్రీజులో ఉన్నాడు.