tirumala: తిరుమల మెట్ల మార్గంలో గుండెపోటుతో ముస్లిం భక్తుడు మృతి...శ్రీవారి దర్శనానికి కాలినడకన
- మరో పదినిమిషాల్లో కొండపైకి చేరుకుంటారనగా ఘటన
- మృతుడు గుంటూరు జిల్లా తూములూరు వాసి
- భార్యా, పిల్లలతో స్వామి దర్శనానికి
అతనో ముస్లిం. కానీ తిరుమల శ్రీవారిపై ఉన్న అపార నమ్మకం. ఏటా స్వామి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఎప్పటిలాగే కుటుంబంతో మెట్ల మార్గంలో కాలి నడకన కొండపైకి బయలుదేరాడు. మరో పది నిమిషాల్లో కొండపైకి చేరుకుని స్వామి దర్శన భాగ్యం చేసుకునేందుకు సిద్ధమవుతుండగా గుండె పోటుతో మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొల్లిపర్ మండలం తూములూరుకు చెందిన షేక్ బాషైదా (34) వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడు. అప్పుడప్పుడూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉండేవాడు. ఎప్పటిలాగే శనివారం కూడా భార్య గౌసియా, కుమార్తె పర్హానా, కుమారుడు పీరాతో కలిసి తిరుపతి చేరుకున్నాడు. మధ్యాహ్నం అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుమలకు బయలుదేరాడు.
మరో పది నిమిషాల్లో కొండపైకి చేరుకుంటారనగా అతనికి గుండెపోటు వచ్చింది. దేవస్థానం సిబ్బంది హుటాహుటిన బాధితుడిని అశ్విని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తన భర్తకు వేంకటేశ్వరస్వామి అంటే ఎంతో నమ్మకమని, ఏటా స్వామి దర్శనానికి వస్తుంటామని, ఆయన శ్రీవారి సన్నిధిలోనే ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని అతని భార్య గౌసియా కన్నీటి పర్యంతమవుతూ తెలిపింది.