BJP: ఇప్పటికే ఓ మాజీ సీఎం కొడుకు, ఓ సీఎం కుమార్తె ఓడిపోయారు... తెలుగు రాష్ట్రాల్లో మరెన్నో జరుగుతాయి: కిషన్ రెడ్డి
- రాబోయే రెండేళ్లలో ఏంజరుగుతుందో ఎవరూ ఊహించలేరు
- బాబు ఫ్రంట్ జపంచేస్తే ఏపీలో ఆయన టెంటే కూలిపోయింది
- భవిష్యత్ లో ఏపీలో కూడా జెండా ఎగురవేస్తాం
రాబోయే రెండేళ్లలో ఏపీ, తెలంగాణల్లో భారీ రాజకీయ ప్రకంపనలు తప్పవని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో ఇకముందు ఏంజరగబోతుందో ఎవరూ ఊహించలేరని, ఆశ్చర్యకరమైన రీతిలో రాజకీయ పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీలో మాజీ సీఎం కుమారుడు, తెలంగాణలో సీఎం కుమార్తె ఓటమిపాలయ్యారని గుర్తుచేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు కుటుంబపాలనను వ్యతిరేకించడం మొదలుపెట్టారనడానికి ఇదే నిదర్శనం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
చంద్రబాబు ఎన్నికల వేళ ఫ్రంట్ ఫ్రంట్ అన్నారని, చివరికి ఏపీలో ఆయన టెంటే కూలిపోయిందని వ్యంగ్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ తో జతకట్టిన కారణంగానే చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెప్పారని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో గుణాత్మక మార్పు తెస్తానన్న కేసీఆర్ తన కుమార్తెను గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. భవిష్యత్ లో ఏపీలో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో త్రిపురలో ఒక్కశాతం ఓటింగ్ కూడా లేదని, ఇప్పుడా రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ గురించి వ్యాఖ్యానిస్తూ, కనీసం అధ్యక్షుడు ఎవరో చెప్పుకోలేని స్థితిలో ఆ జాతీయ పార్టీ ఉందని అన్నారు.