Jagan: సోమవారం సీఎం జగన్ సొంత జిల్లా పర్యటన... షెడ్యూల్ ఇదే!
- రేపు ఉదయం కడప చేరుకోనున్న జగన్
- ఇడుపులపాయలో వైఎస్సార్ కు నివాళులు
- అనేక అభివృద్థి పనులకు శంకుస్థాపన
ఏపీ సీఎం జగన్ సోమవారం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తన తండ్రి, దివంగత రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి వేడుకల కోసం ఇడుపులపాయ వస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రత్యేకవిమానంలో కడప చేరుకోనున్న జగన్, నేరుగా ఇడుపులపాయ వెళ్లి తన తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గండిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పులివెందులలో వైఎస్సార్ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అరటి పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు.
అనంతరం 11 గంటల 15 నిమిషాలకు జమ్మలమడుగులో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. జగన్ పాల్గొంటున్న ఈ సభ కోసం ముద్దనూరు రోడ్డులో భారీగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో 20,000 మంది, సభా వేదికపై 75 మంది కూర్చొనేలా ఏర్పాటు చేశారు. ఈ సభలో వైఎస్సార్ పింఛను కానుక, రైతులకు లబ్ది చేకూర్చే పలు ప్రకటనలు చేసే అవకాశాలున్నాయి. కాగా, ప్రతి సంవత్సరం జూలై 8న రాష్ట్రంలో రైతు దినోత్సవం జరిపేందుకు సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అటు, సీఎం అయ్యాక జగన్ కడప జిల్లా రావడం ఇదే తొలిసారి.