Uttar Pradesh: యూపీలో కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 29 మంది దుర్మరణం
- ఆగ్రా సమీపంలో ఘటన
- 16 మందికి గాయాలు
- సీఎం యోగి దిగ్భ్రాంతి
లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు ఈ తెల్లవారుజామున కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో 29 మంది దుర్మరణం చెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బస్సు యమున ఎక్స్‌ప్రెస్ వే పైనుంచి ప్రయాణిస్తుండగా ఆగ్రా సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు.
అవధ్ బస్ డిపోకు చెందిన జన్‌రాత్ ఎక్స్‌ప్రెస్ రోడ్‌వే బస్సు కుబేర్‌పూర్ సమీపంలో అదుపుతప్పి ఝర్నా నాలాలోకి దూసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 27 మంది ప్రయాణికుల మృతదేహాలను వెలికి తీసినట్టు చెప్పారు. బస్సు 15 అడుగుల లోతున్న కాల్వలో పడిందని, 20 మందిని రక్షించామని, వీరిలో గాయపడిన 16 మందిని ఆసుపత్రికి తరలించినట్టు ఆగ్రా ఐజీ సతీశ్ గణేశ్ తెలిపారు.
ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు యూపీ రోడ్డు రవాణా సంస్థ 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.