Warangal Urban District: సెల్ఫోన్లో అశ్లీల పాఠాలు...ఓ అధ్యాపకుడి తీరిది
- బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి షీ బృందాలు
- కళాశాలకు వెళ్లి విచారణ
- నిజమని తేలడంతో నిందితుడి అరెస్టు
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకుడు వారి సెల్‌ఫోన్‌కి అశ్లీల మెసేజ్‌లు, చిత్రాలు పంపుతూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు గుర్తించి కటకటాల వెనక్కినెట్టారు పోలీసులు. వివరాల్లోకి వెళితే...తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హన్మకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన తొంబురపు రంజిత్‌కుమార్ అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు.
చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థినులను గుర్తించి వారికి తన సెల్‌ఫోన్ నంబరు ఇచ్చేవాడు. సందేహాల కోసం ఫోన్ చేసిన విద్యార్థినులను మెల్లగా ట్రాప్ చేసేవాడు. అలా తన ట్రాప్ లో పడిన వారికి అసభ్యకర మెసేజ్‌లు, చిత్రాలు పంపుతూ వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధిత విద్యార్థినుల్లో ఒకరు విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తేవడంతో వారు కమిషనరేట్ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు.
దీంతో కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు షీ బృందం ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్‌రావు రంగంలోకి దిగారు. అధ్యాపకుడు పనిచేస్తున్న కళాశాలకు వెళ్లి సిబ్బందిని, విద్యార్థినులను విచారించారు. అధ్యాపకుడి లైంగిక వేధింపులు నిజమేనని తేలడంతో కేసు నమోదుచేసి అతన్ని అరెస్టు చేశారు.