USA: ఓ వ్యక్తిని 100 సార్లు కొరికి హతమార్చిన శునకాలు!
- అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన
- ఇంటికి అడ్డదారిలో బయలుదేరిన మెల్విన్
- ఆరు శునకాలను పట్టుకున్న పోలీసులు
సాధారణంగా ఇంటికి వెళ్లేందుకు ఆలస్యమయ్యే అవకాశం ఉంటే మనలో చాలామంది షార్ట్ కట్ దారిని ఎంచుకుంటారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తి కూడా ఇలాగే ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఆయనపై ఓ కుక్కల గుంపు దాడి చేసింది. ఈ గుంపు విచక్షణారహితంగా కరవడంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లోరిడా రాష్ట్రంలోని లేక్ ప్లాసిడ్ వద్ద గత గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మెల్విన్ ఓల్డ్స్ జూనియర్(45) తన పని ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే చుట్టూ తిరిగివెళ్లేబదులుగా సమీపంలోని మైదానం నుంచి షార్ట్ కట్ మార్గంలో ఇంటికి బయలుదేరారు. అయితే అక్కడే మూగి ఉన్న కుక్కల గుంపు ఆయనపై ఒక్కసారిగా దాడిచేసింది. ఈ శునకాలు మెల్విన్ ను 100 సార్లు కరిచాయి. దీంతో తీవ్ర రక్తస్రావంతో మెల్విన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గాలింపును ప్రారంభించిన సిబ్బంది, లేక్ ప్లాసిడ్ సమీపంలో మెల్విన్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బోన్లు ఏర్పాట్లు చేసిన పోలీసులు-జంతు సంరక్షణ సిబ్బంది ఆరు శునకాలను పట్టుకున్నారు. వీటి పళ్లు, మెల్విన్ శరీరంపై ఉన్న గాయాలతో సరిపోలాయని పోలీసులు తెలిపారు. ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.