YSR: పార్లమెంటులో వైఎస్ విగ్రహం ప్రతిష్టించండి: స్పీకర్ కు లేఖ రాసిన వైసీపీ ఎంపీ
- లేఖలో వైఎస్ గొప్పతనాన్ని ఏకరవు పెట్టిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- వైఎస్ ను గౌరవించాలంటూ వినతి
- జూలై 8న వైఎస్ జయంతికి కానుకగా నిర్ణయం తీసుకోవాలంటూ విజ్ఞప్తి
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలంటూ మచిలీపట్నం ఎంపీ, వైసీపీ నేత బాలశౌరి కోరుతున్నారు. ఈ మేరకు ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అనేక సంక్షేమపథకాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్సార్ అని, పార్లమెంటులో ఆయన విగ్రహం ప్రతిష్టాపన చేయడం ద్వారా గౌరవించాలని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే వైద్యుడిగా కేవలం రూపాయి తీసుకుని సేవలు అందించారని, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, పోలవరం, పులిచింతల వంటి ప్రాజక్టులకు ఆయనే ఆద్యుడు అని బాలశౌరి తన లేఖలో వివరించారు. జూలై 8న వైఎస్ జయంతిని పురస్కరించుకుని, పార్లమెంటు ప్రాంగణంలో ఆయన విగ్రహ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడం ద్వారా అభిమానులకు కానుక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.