cuddapah: కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తా: సీఎం జగన్
- మూడేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తాం
- ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం
- డిసెంబర్ 26నే కుందూ నదిపై ప్రాజెక్టును ప్రారంభిస్తా
కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తానని సీఎం జగన్ ప్రకటించారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, మూడేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తామని, ఇరవైవేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కేసీ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు కుందూ నదిపై రాజోలి, జలదరాశి ప్రాజెక్టులు నిర్మిస్తామని, డిసెంబర్ 26వ తేదీన ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఈ నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా బ్రహ్మసాగర్ కు నీళ్లు తీసుకొస్తామని చెప్పారు.
కరవు ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని కనుక ప్రాజెక్టుల ప్రయోజనం గురించి తనకు తెలుసని అన్నారు. ప్రాజెక్టుల ద్వారా డబ్బులు కాదు నీరు ఎలా రావాలో చూసుకుంటానని అన్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అభివృద్ధికి మొదటి అడుగు పడుతుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, వ్యవసాయ లేబొరేటరీలను ఏర్పాటు చేస్తామని, రైతులకు నాణ్యమైన పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు అందజేస్తామని చెప్పారు. భూ యజమానుల హక్కులను పూర్తిగా కాపాడతామని, అదే సమయంలో కౌలు రైతులకు అండగా ఉంటామని, కౌలు రైతు చట్టంలో మార్పులు తెస్తామని, అసెంబ్లీ సమావేశాల్లో కౌలు రైతులకు కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పారు. చెన్నూర్ షుగర్ ఫ్యాక్టరీని త్వరలో తెరుస్తామని హామీ ఇచ్చారు.