Sachin Tendulkar: వందేళ్ల నాటి కారులో భార్యతో కలిసి సచిన్ లండన్ వీధుల్లో విహారం
- ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ లో ఉన్న సచిన్
- లండన్ రాయల్ ఆటోమొబైల్ క్లబ్ సందర్శన
- సెయింట్ జేమ్స్ వీధిలో మీడియా కంటబడిన వైనం
ప్రపంచకప్ కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తుండడంతో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా కుటుంబంతో సహా అక్కడే ఉన్నాడు. టీమిండియా ఆడే మ్యాచ్ లకు హాజరవుతూ ఆటగాళ్లను ఉత్సాహపరుస్తున్నాడు. సచిన్ కు కార్లంటే విపరీతమైన మోజు అన్న సంగతి తెలిసిందే. గతంలో సచిన్ కొన్ని రేసు కార్లను కూడా నడిపాడు. తాజాగా, వందేళ్లు పైబడిన ఓ పాత కారుతో లండన్ వీధుల్లో విహరించాడు. లండన్ లోని రాయల్ ఆటోమొబైల్ క్లబ్ కు అనుబంధంగా ఉన్న పాల్ మాల్ వింటేజ్ క్లబ్ హౌస్ ను సచిన్ సందర్శించాడు.
అక్కడ ఉన్న 119 ఏళ్ల నాటి విక్టోరియా కారు సచిన్ ను బాగా ఆకట్టుకుంది. దాంతో అక్కడివారిని అడిగి దాన్ని ఎలా డ్రయివ్ చేయాలో ఆకళింపు చేసుకున్నాడు. ఆపై, తన అర్ధాంగి అంజలితో కలిసి ఆ కారును నడుపుకుంటూ లండన్ వీధుల్లో విహరించాడు. ఆ వింటేజ్ కారును స్వయంగా నడుపుతూ సెయింట్ జేమ్స్ వీధిలోకి రాగానే మీడియా కంటబడ్డాడు. ప్రస్తుతం సచిన్ వింటేజ్ కార్ డ్రయివింగ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తున్నాయి.