Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల్లో బ్యాలెట్టే వాడాలని రాజ్ థాకరే డిమాండ్
- ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయన్న ఎంఎన్ఎస్ అధినేత
- ఈసీకి వినతిపత్రం సమర్పణ
- ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు!
ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పార్టీలన్నీ ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పార్టీ అధ్యక్షుడు రాజ్ థాకరే ఈవీఎంలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై తమకు అనుమానాలున్నాయంటూ ఆయన ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేశారు. ఈవీఎంల పనితీరు, ప్రస్తుత రాజకీయాలపై యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతోనూ రాజ్ థాకరే సమావేశమయ్యారు. కాగా, రాజ్ థాకరే, సోనియా భేటీ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఎన్ఎస్, ఎన్సీపీ కూటమిగా ఏర్పడి బరిలో దిగొచ్చన్న ఊహాగానాలు బలపడతున్నాయి.