Uttar Pradesh: యూపీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్న పీఎం
- విచారం వ్యక్తం చేసిన మమత, జేపీ నడ్డా
- విచారణకు ఆదేశించిన ఆదిత్యనాథ్
యూపీ బస్సు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రి.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్టు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తదితరులు కూడా బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ప్రమాదంపై యూపీ సీఎం విచారణకు ఆదేశించారు.
లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న యూపీ ఆర్టీసీ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో సోమవారం తెల్లవారుజామున ఆగ్రా సమీపంలో అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.