Andhra Pradesh: ప్రజా సమస్యలపై సీఎం జగన్ దృష్టి.. మరికాసేపట్లో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్!
- ఈ రోజు ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం
- ‘స్పందన’ కార్యక్రమంపై ఫీడ్ బ్యాక్ తీసుకోనున్న సీఎం
- అనంతరం గవర్నర్ నరసింహన్ తో ప్రత్యేకంగా భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై ఈరోజు సమీక్ష చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈరోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంలో అందిన ఫిర్యాదులు, వాటిని పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలను సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకుంటారని పేర్కొన్నాయి.
ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి జగన్ తెలుగురాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్ ఈరోజు విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిసోడియా స్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్ విజయవాడలోని గేట్ వే హోటల్ లో బస చేయనున్నారు. అక్కడే సీఎం జగన్ తో దాదాపు గంట పాటు భేటీ కానున్నారు.