Andhra Pradesh: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీల పిటిషన్లు వాయిదా!
- తనపై కేసులు కొట్టివేయాలన్న రవిప్రకాశ్, నటుడు శివాజీ
- రెండు పిటిషన్లను ఈ నెల 21కి వాయిదా వేసిన హైకోర్టు
టీవీ9 సంస్థను మోసం చేశారన్న కేసులో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. అలాగే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని నటుడు శివాజీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను కూడా జూలై 21కి వాయిదా వేసింది. ఇటీవల రూపురేఖలు మార్చుకుని అమెరికాకు పారిపోతున్న నటుడు శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన పాస్ పోర్టును జప్తు చేసిన పోలీసులు.. ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీచేశారు. టీవీ9 బోర్డులో డైరెక్టర్ల నియామకానికి అడ్డుపడ్డ రవిప్రకాశ్, ఇందుకోసం ఫోర్జరీ పత్రాలను సృష్టించినట్లు అలంద మీడియా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది. అలాగే టీవీ9 లోగోను కారుచవకగా మరో సంస్థకు అమ్మేందుకు ప్రయత్నించడంపై కూడా మరో ఫిర్యాదు చేసింది. అలాగే నటుడు శివాజీపై కూడా ఈ సందర్భంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.