HAJ: హజ్ యాత్రికులకు శుభవార్త.. ‘జమ్ జమ్’ నీటిని తెచ్చుకొనేందుకు ఎయిరిండియా అనుమతి!
- లగేజీ పరిమితిలో అనుమతిస్తామన్న సంస్థ
- గతంలో నిషేధం విధించడంపై విచారం
- ఇస్లాంలో జమ్ జమ్ నీటికి గొప్ప విశిష్టత
భారత్ నుంచి హజ్ యాత్రకు వెళుతున్న ముస్లింలకు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా శుభవార్త తెలిపింది. సౌదీ అరేబియాలోని మక్కా, మదీనాను సందర్శించుకున్నాక తిరుగుప్రయాణంలో ముస్లిం యాత్రికులు అక్కడి పవిత్రమైన ‘జమ్ జమ్’ నీటిని విమానంలో తెచ్చుకునేందుకు అనుమతిస్తామని ప్రకటించింది. గతంలో జమ్ జమ్ నీటిని విమానంలో తెచ్చుకోవడంపై నిషేధం విధించామనీ, ఆ నిర్ణయంపై విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పింది. ప్రయాణికులకు అనుమతించిన లగేజీ పరిమితిలోనే జమ్ జమ్ నీటిని తెచ్చుకోవచ్చని పేర్కొంది.
జమ్ జమ్ నీటికి ఇస్లాం మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ జమ్ జమ్ బావిని సర్గపు సెలయేర్లలో ఒకటిగా ముస్లింలు నమ్ముతారు. ఈ నీరు తలనొప్పి, కడుపునొప్పికి దివ్యౌషధంగా పనిచేస్తుందంటారు. ఈ జమ్ జమ్ బావి నీరు తాగితే కంటి చూపు మెరుగవుతుందని చెబుతారు. ఓ సారి జమ్ జమ్ నీటి గురించి మొహమ్మద్ ప్రవక్త మాట్లాడుతూ.. ‘ప్రజలు ఎవరైనా ఏ సదుద్దేశంతో అయితే జమ్ జమ్ నీటిని తాగుతారో వారి కోరిక తప్పక ఫలిస్తుంది’ అని చెప్పారు. అందుకే హజ్ యాత్రకు వెళ్లిన ప్రతీ ముస్లిం జమ్ జమ్ నీటిని వెంట తీసుకొస్తారు.