Anna Hazare: కాంగ్రెస్ నేత హత్య కేసులో సీబీఐ కోర్టు ముందు సాక్షిగా హాజరైన అన్నా హజారే
- 2006లో హత్యకు గురైన పవన్ రాజే నింబాల్కర్
- సుప్రీం తీర్పుతో సాక్షిగా కోర్టుకు హాజరైన అన్నా హజారే
- అన్నా వాంగ్మూలాన్ని నమోదు చేసిన కోర్టు
2006లో జరిగిన కాంగ్రెస్ నేత పవన్ రాజే నింబాల్కర్ హత్య కేసులో నేడు సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే హాజరయ్యారు. సాక్షిగా ఆయన కేసు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఈ కేసులో నిందితుడైన ఎన్సీపీ మాజీ ఎంపీ పదంసిన్హ్ పాటిల్ కూడా కోర్టు ముందు హాజరయ్యారు.
2006 జూన్ లో నవీ ముంబైలోని కలామ్ బోలి ప్రాంతంలో నింబాల్కర్ హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణలో అన్నా హజారేను సాక్షిగా చేర్చాలంటూ నింబాల్కర్ భార్య ఆనంది దేవి కోర్టును కోరారు. అయితే ఆమె విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా... అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దీంతో, ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... హైకోర్టు తీర్పును పక్కనపెడుతూ, అన్నా హజారే వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. మరోవైపు పదంసిన్హ్ తనను హత్య చేస్తానని బెదిరించారని 2002లో అన్నా హజారే ఆరోపించారు.