Congress: రాజీనామా చేసినా సాంకేతికంగా చూస్తే ఇప్పటికీ రాహుల్ గాంధీనే కాంగ్రెస్ అధ్యక్షుడు: జనార్దన్ ద్వివేది
- ఎన్నికల్లో ఓటమికి రాహుల్ రాజీనామా
- రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా ఉండాలంటున్న కాంగ్రెస్ సీనియర్లు
- ససేమిరా అంటున్న కాంగ్రెస్ యువనేత
దేశంలోని అతిపెద్ద జాతీయపార్టీల్లో ఒకటైన కాంగ్రెస్ ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటినుంచి ఆ పార్టీలో అనిశ్చితి రాజ్యమేలుతోంది. రాహుల్ బాటలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు రాజీనామా చేస్తుండగా, పార్టీ చీఫ్ గా మీరే ఉండాలంటూ సీనియర్లు రాహుల్ ను బతిమాలుతున్నారు. రాహుల్ మాత్రం ససేమిరా అంటుండడం కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది.
ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జనార్దన్ ద్వివేది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేసినప్పటికీ సాంకేతిక కారణాల రీత్యా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీనే అధ్యక్షుడని తెలిపారు. రాహుల్ రాజీనామాకు ఎవరి ఆమోదంలేదని తెలిపారు. అయితే, రాహుల్ తన వారసుడి ఎంపిక కోసం ఓ కమిటీ ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ కోసం మార్గం సుగమం చేయాలని సూచించారు. ఈ విషయంలో రాహుల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ద్వివేది స్పష్టం చేశారు.