Bigboss: మహిళా ప్రేక్షకులు కంటెస్టెంట్లను చూడాలో.. నాగ్ని చూడాలో తెలియక తికమక పడతారు: పరుచూరి గోపాలకృష్ణ
- నాగ్ ‘మన్మథుడు’లా చేశారు
- చిన్న రామయ్య మాసీగా చేశాడు
- నాని ఆ పంచ్‌లు లేకుండా క్లాసీగా చేశాడు
‘బిగ్‌బాస్’ అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ షో సీజన్ - 3 కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల్లో బిగ్‌బాస్ ఫీవర్ మొదలై పోయింది. హోస్ట్, కంటెస్టెంట్ల విషయంలో పలువురి పేర్లు బాగా వినిపించాయి. అయితే హోస్ట్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా చేస్తున్నారని వెల్లడిస్తూ సదరు షో యాజమాన్యం ప్రోమోలను విడుదల చేసింది. అయితే నాగ్ హోస్టింగ్ పై తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చిన్న రామయ్య(జూనియర్ ఎన్టీఆర్) మాసీగా చేశాడని, సీజన్-2ను నాని క్లాసీగా చేశాడని కానీ నాగ్ ‘మన్మథుడు’లా చేశారని ప్రోమోను బట్టి తెలుస్తోందన్నారు.
14 మంది వ్యక్తిత్వాలను బయట కూర్చొన్న వ్యక్తి విశ్లేషించడం సాధారణ విషయం కాదని, కానీ చిన్న రామయ్య దానిని అవలీలగా చేసేశాడని చెప్పుకొచ్చారు. అయితే నాని హోస్టింగ్‌లో చిన్న రామయ్యలో ఉన్న చెణుకులు, పంచ్‌లు లేవని, చాలా క్లాసీగా, అద్భుతంగా నడిపాడని తెలిపారు. ఇక నాగార్జున ‘మన్మథుడు’లా చేశారని ప్రోమోని బట్టి అర్థమవుతోందన్నారు. ఈ కార్యక్రమం చూసే మహిళా ప్రేక్షకులు, బిగ్ బాస్ ఇంట్లో ఉండే కంటెస్టెంట్లను చూడాలా? లేదంటే నాగ్ని చూడాలో అర్థం కాక తికమక పడతారని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నాగ్‌తో పాటు కంటెస్టంట్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.