ambati rayudu: రాయుడూ...రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచించు: యువరాజ్‌సింగ్ తండ్రి యోగ్రాజ్ సూచన
- ప్రపంచకప్‌లో చోటుదక్కక ఆటకు వీడ్కోలు పలికిన యువ క్రికెటర్
- ఆయన జట్టులో ఉండదగ్గవాడన్న యోగ్రాజ్
- అందుకే నిర్ణయం వెనక్కి తీసుకోమని కోరుతున్నా
టీమిండియా జట్టులో కచ్చితంగా ఉండాల్సిన క్రికెటర్ అంబటి రాయుడని, అందువల్ల అతను తన రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నానని డాషింగ్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ తండ్రి యోగ్రాజ్ సూచించారు. ప్రపంచకప్ జట్టులో స్థానం లభించక పోవడం, స్టాండ్‌బై సభ్యుడిగా ఉన్నా అవకాశం లేకుండా చేశారన్న ఆగ్రహంతో అన్ని ఫార్మాట్లకు రాయుడు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
టీమిండియా సభ్యుడైన ధావన్ గాయపడి టోర్నీకి దూరం కావడంతో ఆ స్థానంలో రిషబ్ పంత్‌ను పంపారు. విజయ్ శంకర్‌కు గాయమై టోర్నీ నుంచి నిష్క్రమించడంతో రాయుడుకు అవకాశం వస్తుందని అంతా అనుకున్నారు. కానీ రాయుడుకు పిలుపు అందలేదు. దీంతో మనస్తాపం చెందిన రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీనిపై రాయుడు పునరాలోచించాలని ఇప్పటికే చాలామంది సీనియర్ క్రికెటర్లు కోరారు.
తాజాగా యోగ్రాజ్ కూడా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే సూచన చేశారు. రంజీ, ఇరానీ, దులీప్ ట్రోపీల్లో రాయుడు ఎన్నో మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని, ఎన్నో పరుగులు చేయాల్సిన సామర్థ్యం ఆయన వద్ద మిగిలే ఉందని, ఆయన రిటైర్మెంట్ వల్ల క్రికెట్ అభిమానులు దీన్ని మిస్ అవుతారని అన్నారు. రాయుడు కూడా తన కొడుకులాంటివాడని, విరక్తితో అతను తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నానన్నారు. నిన్ను విస్మరించిన వారికి నీవేంటో నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశం అని ఆయన రాయుడికి సూచించారు.