Andhra Pradesh: ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి: సీఎం జగన్
- కలెక్టర్లతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
- స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై సమీక్ష
- ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంపై ఆదేశాలు జారీ
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. సచివాలయం వేదికగా కలెక్టర్లతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై సమీక్షించారు. నేరుగా జిల్లాల్లోని కలెక్టర్లు, అధికారులతో మాట్లాడారు. ఈ సమీక్షలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
2014-2019 వరకు ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంపై ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 1,513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు రికార్డులు చెబుతుంటే, 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టుగా ఉన్నాయని, వీరికి గత ప్రభుత్వం పరిహారం నిరాకరించినట్టుగా అర్థమవుతోందని అన్నారు. ఆయా జిల్లాల్లో డేటాను పరిశీలించాలని, ఎవరైనా అర్హులున్న రైతు కుటుంబాలు ఉంటే వెంటనే పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని, ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే కలెక్టర్ స్పందించాలని, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ కుటుంబం వద్దకు వెళ్లాలని ఆదేశించారు.