Congress: కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ.. గోవాలో పదిమంది ఎమ్మెల్యేలు గుడ్‌బై!
- కాంగ్రెస్‌కు మరో భారీ షాక్
- బీజేపీలో విలీనమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- ఐదుకు పడిపోయిన కాంగ్రెస్ బలం
ఇప్పటికే కర్ణాటక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగిలింది. గోవా శాసనసభలో కాంగ్రెస్‌కు ఉన్న 15 మంది శాసనసభ్యులలో పదిమంది ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, తమను బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు స్పీకర్ రాజేశ్ పట్నేకర్‌ను కలిసి లేఖ ఇచ్చారు. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు విలీనానికి సై అనడంతో కాంగ్రెస్ శాసనసభా పక్షం బీజేపీలో విలీనమైంది.
ఈ సందర్భంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం అయినట్టు తెలిపారు. కాగా, కాంగ్రెస్‌ను వీడడానికి గల కారణాలను మాత్రం కవ్లేకర్ వెల్లడించలేదు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 శాసనసభ స్థానాలుండగా, బీజేపీ-17, కాంగ్రెస్-15, గోవా ఫార్వార్డ్ పార్టీ-3, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ-1, ఎన్సీపీ-2, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్‌కు ఉన్న 15 మంది ఎమ్మెల్యేల్లో పదిమంది పార్టీని వీడుతున్నట్టు ప్రకటించడంతో కాంగ్రెస్ బలం ఐదుకు పడిపోయింది.